Ganta: డిఎస్సీ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష... ఏపీపీఎస్సీ చైర్మన్ తో భేటీ!
- జూన్ 12, 2018 కల్లా ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులు
- ఆన్ లైన్ లో నిర్వహించాలా? లేక ఆఫ్ లైన్ లో నిర్వహించాలా? అన్న అంశంపై చర్చ
- నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని స్పష్టం చేసిన మంత్రి
డిఎస్సీ -2018కి ఎలాంటి సాంకేతిక, ఇతర ఇబ్బందులు రానివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, జూన్ 12, 2018 కల్లా ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందించేలా ముందుకెళ్లాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిఎస్సీ -2018ని ఎలా నిర్వహించాలన్న విషయంపై మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలోని తన చాంబర్ లో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తో భేటీ అయ్యారు.
ఖాళీలు, రోస్టర్, సిలబస్, అర్హతలు ఇతర అంశాలపై చర్చించారు. ఆన్ లైన్ లో నిర్వహించాలా? లేక ఆఫ్ లైన్ లో నిర్వహించాలా? అన్న అంశంపైనా చర్చ సాగింది. సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి గంటా .. ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని స్పష్టం చేశారు.
అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బంది సేవలను అవసరమైతే ఉపయోగించుకోవాలని ఏపీపీఎస్సీ చైర్మన్ కు సూచించారు. నోటిఫికేషన్ జారీ నుంచి ఇతర అనేక అంశాలపైనా, తాము ఇది వరకు నిర్వహించిన పరీక్షల అనుభవాలపైనా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్... మంత్రి గంటాకు వివరించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కమీషనర్ సంధ్యారాణి, సాంకేతిక విద్యా కమీషనర్ పాండా దాస్ పాల్గొన్నారు.