Vizianagaram: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు: గుండె నొప్పితో విలవిల్లాడుతుంటే చోద్యం చూశారు.. ప్రాణం పోయాక వెళ్లిపోయారు!
- ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ప్రయాణికుడిని నడిరోడ్డుపై దించేసిన ఆర్టీసీ డ్రైవర్
- ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ముందుకురాని ఆటో వాలాలు
- అందరూ చూస్తుండగా కొడుకు చేతిలో కన్నుమూసిన తండ్రి
నడిరోడ్డుపై మానవత్వం మంటగలిసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చుట్టూ అందరూ ఉన్నా ప్రాణాలు విడిచాడు. సాయం అందించాల్సిన వారు చోద్యం చూశారు. ఫలితంగా ఓ నిండు ప్రాణం నడిరోడ్డుపై బలైంది. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది.
శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీకి చెందిన పొన్నాడ అచ్యుత్ (50) ఎల్ఐసీ ఏజెంట్. వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆయన స్థానిక ఆసుపత్రులలో చూపించుకున్నా నయం కాలేదు. దీంతో కుమారుడు విష్ణుతో కలిసి బుధవారం ఆర్టీసీ బస్సులో విశాఖపట్టణం బయలుదేరాడు. బస్సు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు.
గుండెల్లో నొప్పిగా ఉందని కుమారుడికి చెప్పాడు. విష్ణు కండక్టర్‌కు విషయం చెప్పి ఏదైనా ఆసుపత్రి కనిపిస్తే ఆపాలని కోరాడు. ఈ క్రమంలో చాకివలస చౌరస్తా వద్దకు వచ్చేసరికి అచ్యుత్‌కు నొప్పి ఎక్కువై విలవిల్లాడిపోయాడు. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసి అచ్యుత్, అతడి కుమారుడిని నడిరోడ్డుపై దించేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుమారుడు ఆటోవాలాలను బతిమాలినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ ఆటో డ్రైవర్ ముందుకొచ్చి ఎక్కించుకున్నాడు. అయితే నొప్పి మరింత ఎక్కువై అచ్యుత్ విలవిల్లాడిపోతుండడంతో కొంత దూరం వచ్చాక ఆటో డ్రైవర్ వారిని దించేసి వెళ్లిపోయాడు.
సాయం చేసే దిక్కులేక నడిరోడ్డుపై తీవ్ర మానసిక వేదన అనుభవిస్తుండగానే కుమారుడి చేతిలో ఆ తండ్రి కన్నుమూశాడు. అచ్యుత్ చనిపోయిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయి. కిలోమీటరు దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. బస్సు డ్రైవర్ కనికరించినా, ఆటో డ్రైవర్ మరికొంత దూరం తీసుకెళ్లినా అచ్యుత్ బతికి ఉండేవాడు. చుట్టూ గుమిగూడిన స్థానికులను చేతులెత్తి మొత్తుకున్నా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని విష్ణు కన్నీటి పర్యంతమయ్యాడు.