Hafiz Saeed: కశ్మీర్ సమస్యను ఉగ్రవాది హఫీజ్ సయీద్ పరిష్కరిస్తాడట!... పాక్ ఆర్మీ చీఫ్ ఉవాచ
- ముషారఫ్ మద్దతు ప్రకటించిన రెండు రోజులకే ఆర్మీ చీఫ్ మద్దతు
- కశ్మీర్ సమస్యను పరిష్కరించే సత్తా ఉందని కితాబు
- కోర్టు ఆదేశంతో గత నెలలో గృహ నిర్బంధం నుంచి బయటపడిన ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి
నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ నుంచి మరో మద్దతు లభించింది. సయీద్‌కు కశ్మీర్ సమస్యను పరిష్కరించే సత్తా ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. పాక్‌లోని ప్రతీ పౌరుడిలాగే సయీద్‌ను కూడా చూస్తామన్న ఆయన కశ్మీర్ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సెనేట్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బజ్వా స్పందిస్తూ.. అందరు పాకిస్తానీల లానే సయీద్ కూడా కశ్మీర్ అంశాన్ని చూస్తున్నాడని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించగలిగే సత్తా అతడికి ఉందని కితాబిచ్చారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో అతడు కీలక పాత్ర పోషించగలడని పేర్కొన్నారు. లష్కరే తాయిబా (ఎల్ఈటీ), జేయూడీలకు మద్దతు ఇస్తున్నట్టు పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రకటించి రెండు రోజులైనా కాకముందే ఆర్మీ చీఫ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలకు 10 మిలియన్ డాలర్ల విలువ కట్టింది. గత కొంతకాలంగా పాక్‌లో గృహ నిర్బంధంలో ఉన్న హఫీజ్ కోర్టు ఆదేశంతో గత నెలలో విడుదలయ్యాడు.