indian science congress: ప్రభుత్వానికి షాక్.. ఉస్మానియాలో నిర్వహించతలపెట్టిన 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్' వాయిదా!
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా
- ఓయూలో ఉద్రిక్త పరిస్థితులే కారణం
- వందేళ్లలో ఈ సదస్సు వాయిదా పడటం ఇదే తొలిసారి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో ఈ సదస్సు జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఈ సదస్సును వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితం సైన్స్ కాంగ్రెస్ తన వెబ్ సైట్ ద్వారా తెలిపింది.
యూనివర్శిటీలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఓయూ వైస్ ఛాన్సెలర్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ సదస్సును నిర్వహించడం కష్టమని నివేదించారని తెలిపింది. ప్రధాని మోదీ కూడా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, శాంతి భద్రతలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టుతో సదస్సును వాయిదా వేశారు. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదాబాద్ లో జరగాల్సి ఉంది. గత వందేళ్లలో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం ఇదే తొలిసారి. గత ఏడాది ఈ సదస్సు ఏపీలోని ఎస్వీ యూనివర్శిటీలో నిర్వహించారు.
ఇటీవలే ఓ విద్యార్థి ఓయూలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, అక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, నాన్ టీచింగ్ స్టాఫ్ నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇంకొకవైపు లంబాడాలు-ఆదివాసీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోంది. వీటికి సంబంధించిన విద్యార్థులు యూనివర్శిటీలో ఉండటంతో... ఏ క్షణంలోనైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి.