sushma swaraj: 'నేనేం దేవుణ్ని కాదు... కాలేను కూడా!'.. పాకిస్థానీ యువతికి సుష్మా సమాధానం
- తండ్రి కాలేయ సర్జరీకి వీసా అడిగిన యువతి
- వీసా జారీ చేసిన విదేశాంగ శాఖ
- ట్వీట్లకు జవాబునిచ్చిన సుష్మా స్వరాజ్
ఆరోగ్య సమస్యల దృష్ట్యా భారత్ రావడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ చేయూతనిస్తారు. ముఖ్యంగా పాకిస్థానీలకు ఆమె ఆపద్బాంధవురాలు. ట్విట్టర్లో వీసా కోసం అడిగిన వెంటనే సమాధానం ఇస్తూ వీసాలు జారీ చేస్తుంటారు. ఇదేబాటలో ఇటీవల పాకిస్థాన్‌కి చెందిన రబియా షెహాబ్ అనే యువతి తన తండ్రి కాలేయ సర్జరీ కోసం వీసా జారీ చేయాలని ట్వీట్ ద్వారా కోరింది.
అయితే ఆ ట్వీట్లో సుష్మా స్వరాజ్‌ను రబియా 'ఇబ్నే-ఇ-మరియం' అని పోల్చింది. అంటే మేరీ మాత కుమారుడు, యేసుప్రభు అని అర్థం. ఈ ట్వీట్‌కి జవాబిస్తూ సుష్మా స్వరాజ్ 'నేనేం దేవుణ్ని కాదు.. కాలేను కూడా! నీ బాధ నాకు అర్థమైంది' అని అన్నారు. అంతేకాకుండా రబియా తండ్రికి వీసా కూడా జారీ చేశారు. అలాగే మరో ట్వీట్లో ఫాతిమా అనే మహిళ తన భర్త వీసా కోసం చేతులు జోడిస్తూ వేడుకుంటున్నానని పేర్కొంది. దీనికి `వేడుకోవాల్సిన అవసరం లేదు.. సమస్య చెప్పండి చాలు!` అని సుష్మా సమాధానమిచ్చారు.