rajyasabha: కాంగ్రెస్ సభ్యుల నినాదాల హోరు.. రాజ్యసభలో మాట్లాడలేకపోయిన సచిన్!
- నినాదాలతో ఇబ్బంది కలిగించిన ప్రతిపక్షం
- పది నిమిషాలు నిశ్శబ్దంగా నిల్చున్న సచిన్
- సిగ్గుచేటు అని వ్యాఖ్యానించిన జయాబచ్చన్
దాదాపు ఐదేళ్ల తర్వాత మొదటిసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రాజ్యసభలో మాట్లాడబోతున్నారని అందరూ ఎదురుచూశారు. కానీ ఊహించినట్లుగానే కాంగ్రెస్ వారి పుణ్యమాని ఆయన మాట్లాడకుండానే కూర్చోవాల్సి వచ్చింది. దేశంలో క్రీడల భవిష్యత్తు అంశం మీద సచిన్ సభలో చర్చించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ ప్రొసీడింగ్స్‌కి ఇబ్బంది కలిగించడంతో సచిన్‌కి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
ప్రతిపక్షం వారు నిరసన నినాదాలు చేస్తుండగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తూ సచిన్ దాదాపు పది నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడాల్సి వచ్చింది. ఈ విషయంలో చైర్మన్ వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నప్పటికీ ప్రతిపక్షం వారిని నిలువరించలేకపోయారు. సచిన్‌ను మాట్లాడనివ్వకపోవడంపై ఎంపీ జయాబచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'భారత ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సచిన్. ఇవాళ ఆయన ప్రసంగించనున్నారని తెలిసి కూడా ఇబ్బంది కలిగించడం నిజంగా సిగ్గుచేటు. కేవలం రాజకీయనాయకులకు మాత్రమే సభలో మాట్లాడే హక్కు ఉందా?' అని ఆమె అన్నారు.