somi reddy: ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూల స్పందన: మంత్రి సోమిరెడ్డి హర్షం
- కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో చర్చలు
- చర్చల్లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి
- చర్చలు ఫలించాయని ప్రకటన చేసిన సోమిరెడ్డి
- అవాంతరాలను అధిగమించాం
కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు సోమిరెడ్డి తెలిపారు.
ఢిల్లీలో ఎంపీ సీఎం రమేష్ అధికార నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 13వ షెడ్యూల్ ను అనుసరించి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయక సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై మికాన్ సంస్థ ఇచ్చిన నివేదికను పరిశీలించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో సంబంధిత రాష్ట్ర శాఖ మంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈనెల 27వ తేదీన మరొక దఫా సమావేశమై సమగ్రంగా చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఫీజబిలిటి నివేదికను అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి చేసిన విన్నతి మేరకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు కమిటీ, మికాన్ సంస్థలు పునః సమీక్షించి సత్వరమే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, భూమి, నీరు, రవాణ వంటి మౌలిక వసతులను కల్పించడానికి సంసిద్ధంగా ఉందని సోమిరెడ్డి తెలిపారు. ముడి ఇనుము రవాణ కొరకు సుమారు 130 కిలోమీటర్ల రైలు మార్గం ఏర్పాటు చేయవలసి ఉందని, ఇందుకు సంబంధించిన వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని కేంద్ర మంత్రికి సూచించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. కడపలో ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమకు సమీపంలోనే బయ్యారం ఉక్కు గనులు, జలరవాణాకు కృష్ణపట్నం ఓడరేవు ఎంతో అనుకూలంగా వున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు మంత్రి తెలిపారు.