laxmareddy: పెన్షనర్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పరిధిలోని వైద్య సేవల మీద అపోహలు వద్దు: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
- సంబంధిత అధికారులతో లక్ష్మారెడ్డి సమీక్ష
- ఆ సేవలు కొనసాగుతున్నాయి
- ఈజెహెచ్ఎస్ బకాయిలు త్వరలో క్లియర్
- వైద్య సేవలకు ఆటంకాలు లేవు
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పరిధిలోని వైద్య సేవల మీద అపోహలు వద్దని, ఆ సేవలు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆటంకాలు లేవని, మిగిలి ఉన్న బకాయిలను కూడా కొన్ని రోజుల్లోనే క్లియర్ చేస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఈ రోజు ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏడాదిగా నిరాటంకంగా, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల మన్ననలతో నడుస్తోన్న హెల్త్ స్కీమ్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు. సాంకేతిక, పరిపాలనా పరమైన కారణాల వల్ల తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఆ స్కీమ్ లో వైద్యం చేసిన హాస్పిటల్స్‌కి బిల్లుల బకాయిలు మిగిలాయన్నారు. అయితే వాటిని కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామన్నారు.
ఈ మధ్య ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ల వైద్య సేవలు నిలిచిపోయాయనడం సరికాదన్నారు. వైద్య సేవలు ఎక్కడా నిలిచిపోలేదన్నారు. ఈ స్కీం కింద వైద్య సేవలకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. ఈ సమీక్షలో మంత్రితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సిఇఓ డాక్టర్ మనోహర్, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సీఈవో డాక్టర్ కె.పద్మ, హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.