Ram Nath Kovind: ఏపీ ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రపతి ఫిదా.. టెక్నాలజీకి ముగ్ధుడైన కోవింద్!
- పాలనలో సాంకేతికతను జోడిస్తున్న ఏపీ ప్రభుత్వం
- విషయం తెలిసి వివరాలు తెప్పించుకున్న రాష్ట్రపతి
- ఈనెల 27న ఏపీలో పర్యటన.. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం
పరిపాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగిస్తున్న టెక్నాలజీకి దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ ముగ్ధుడయ్యారు. ప్రతీ పనికి సాంకేతికతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తుండడాన్ని చూసి ఫిదా అయ్యారు. ఏపీ పర్యటనకు రానున్న ఆయన ఏపీ ప్రభుత్వ సాంకేతికతకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 27న ఏపీకి వస్తున్న రాష్ట్రపతి పోలవరం ప్రాజెక్టు పనులను రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్, వై-ఫై, కేబుల్ కనెక్షన్, వీడియో కాలింగ్ సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ప్రారంభించే సమయానికి ఆయా ఇళ్లలో టీవీలు ఆన్ చేసుకుని ఉన్న వారితో కోవింద్ మాట్లాడతారు. అంతేకాదు, వారు కూడా రాష్ట్రపతితో మాట్లాడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తొలి విడతలో రెండు లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వర్చువల్ తరగతి గదులను కోవింద్ పరిశీలిస్తారు.
సచివాలయం నుంచి విద్యుత్ కారులో సీఎం కార్యాలయానికి చేరుకోనున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో తాము ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి వివరిస్తారు. పాలనలో వేగం, కచ్చితత్వం తెచ్చేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయం ఎలా ఉపయోగపడుతున్నదీ వివరిస్తారు. అలాగే ఆర్జీటీలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన 61 అడుగుల వీడియో వాల్ గురించి కూడా రాష్ట్రపతికి వివరిస్తారు.