FIDE: ఇది చెస్సా.. కామసూత్ర షోనా?.. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లోగోపై విమర్శల జడివాన!
- ఏడాది పాటు శ్రమించి కామసూత్ర పోజులో చెస్ లోగో రూపకల్పన
- ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు
- చెస్‌ను రాత్రి చూసే షోగా మార్చేశారన్న విశ్వనాథన్ ఆనంద్
లండన్‌లో జరగనున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్-2018 కోసం విడుదల చేసిన లోగోపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుందాగా ఉండాల్సిన లోగో.. కామసూత్ర పోజులో ఉండడం వివాదాస్పదమైంది. చెస్ దిగ్గజాలు ఈ లోగోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిడే తీరును తప్పుబడుతున్నారు.
కామసూత్ర పోజులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మధ్యలో చెస్ బోర్డు పెట్టుకుని చదరంగం ఆడుతున్నట్టు ఈ లోగోను డిజైన్ చేశారు. చూస్తేనే ఏహ్యభావం కలిగేలా ఉన్న ఈ లోగోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుమించి డిజైన్ దొరకలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
మాస్కోకు చెందిన శుఖ డిజైన్ సంస్థ ఈ లోగోను డిజైన్ చేసింది. ఏడాది పాటు శ్రమించి డిజైన్ చేసిన ఈ లోగోను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందని శుఖ డిజైన్ సంస్థ పేర్కొంది. ఎంతో శ్రమించి అద్భుతమైన ఓ దృశ్య రూపాన్ని తీసుకొచ్చినట్టు ఫిడె చెస్ చాంపియన్ షిప్ నిర్వాహక ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిని బహిరంగ ప్రదేశాలు, ప్రసారమాధ్యమాలతోపాటు పోస్టర్లు, మగ్గులపైనా ఈ లోగోను ముద్రించనున్నట్టు పేర్కొన్నారు.
లోగో కామసూత్రలా ఉందన్న ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతుండగా మరోవైపు చదరంగం బోర్డులో ఆరు X ఆరు గళ్లనే ముద్రించారని క్రీడాకారులు మండిపడుతున్నారు. మొత్తానికి చెస్‌ను రాత్రుళ్లు మాత్రమే చూసే షోగా మార్చేశారని ప్రపంచ దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.