Nellore: సందడిగా కృష్ణపట్నం పోర్టు.. జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభం!
- మూడు రోజులపాటు జరగనున్న జాతీయ స్థాయి పోటీలు
- 27 నుంచి ఇక్కడే అంతర్జాతీయ పోటీలు
- దేశవ్యాప్తంగా 300, ఆసియా దేశాల నుంచి 400 సెయిలర్ల రాక
- త్వరలోనే పోర్టులో సెయిలింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్న సీఈవో అనిల్ ఎండ్లూరి
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెయిలర్లతో సందడిగా మారింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన సెయిలర్లతో కొత్తరూపు సంతరించుకుంది. గురువారం ఇక్కడి ఓడరేవులో జాతీయ సెయిలింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న జాతీయస్థాయి యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ను పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ప్రాక్టీస్ సెషన్స్ జరగ్గా నేటి నుంచి అధికారికంగా పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత యాచింగ్ సంఘం ఆధ్వర్యంలో నవయుగ సెయిలింగ్ అకాడమీ, తమిళనాడు సెయిలింగ్ అసోసియేషన్, ఏపీ యాచింగ్ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి మాట్లాడుతూ.. ఈనెల 25 వరకు జాతీయ స్థాయి పోటీలు, 27 నుంచి 31వ తేదీ వరకు అంతర్జాతీయ పోటీలు ఇక్కడ జరగనున్నట్టు తెలిపారు. జాతీయ పోటీలకు దేశవ్యాప్తంగా 25 క్లబ్‌ల నుంచి 300 మందికిపైగా సెయిలర్లు పాల్గొంటుండగా, అంతర్జాతీయ పోటీలకు ఆసియా దేశాల నుంచి 400 మంది సెయిలర్లు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఆప్టిమిస్టిక్, లేజర్ 4.7, లేజర్, రేడియల్, విండ్‌సర్ఫ్ క్లాస్ విభాగాల్లో పోటీలు జరగనున్నట్టు అనిల్ తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నంలో సెయిలింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలుష్య రహిత ఓడరేవులో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతాయని కోస్ట్‌గార్డ్ కమాండెంట్ అమిత్ ఉనియల్ అన్నారు. కాగా, తొలిరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో సెయిలర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు.