kishan reddy: ఓయూ అంటేనే కేసీఆర్ కు ఇష్టం లేదు.. ద్వేషంతోనే సదస్సును వాయిదా వేశారు: కిషన్ రెడ్డి
- తెలంగాణ పరువు తీశారు
- కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఇలా చేస్తారా?
- కేసీఆర్ భజన కోసమే తెలుగు మహా సభలు
జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయించిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత ఏడాది జరిగిన సభలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని... ఉస్మానియా యూనివర్శిటీ మీద ఉన్న విద్వేషంతో అక్కడ జరగాల్సిన సభలను కేసీఆర్ వాయిదా వేయించారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఈ సభలను వాయిదా వేశారని అన్నారు. 62 దేశాలకు చెందినవారు ఈ సభల కోసం సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారని... వీరిలో ఏడుగురు నోబెల్ పురస్కార గ్రహీతలు కూడా ఉన్నారని చెప్పారు. ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి, ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన తర్వాత ఇలా వ్యవహరించడం ఓయూ ప్రతిష్టను దెబ్బ తీయడమేనని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరితో యావత్ తెలంగాణకు అవమానం జరిగిందని అన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలను టీఆర్ఎస్ మహాసభల మాదిరి నిర్వహించారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన సొంత భజన చేసుకున్నారని... రాచరిక పాలనను తలపించే విధంగా సభలు జరిగాయని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి కానీ, తెలుగు కళాశాలలకు కానీ ఒక్క రూపాయైనా కేటాయించారా? అని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కింద ఉంటే... ఎంఐఎం అధినేత ఒవైసీ పైన ఉంటారని... ఇవేం తెలుగు సభలని ఎద్దేవా చేశారు.