Sunny Leone: సన్నీ వేడుకను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?.. పోలీసులను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు
- డిసెంబర్ 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశం
- మిగతా న్యూ ఇయర్ పార్టీలకు అనుమతివ్వడంపై ప్రశ్న
- డిసెంబర్ 31న బెంగళూరులో జరగాల్సిన సన్నీ నైట్స్ వేడుక
బెంగళూరు వ్యాప్తంగా న్యూఇయర్ కోసం 50కి పైగా వేడుకలు జరుగుతుండగా కేవలం సన్నీ లియోన్ పాల్గొనే వేడుకను మాత్రమే టార్గెట్ చేసి, అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వెల్లడించాలని కర్ణాటక పోలీసులను అక్కడి హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 25లోగా మొత్తం న్యూఇయర్ ఈవెంట్ల వివరాలను, సన్నీ షోకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వివరించాలని పేర్కొంది.
కాగా, డిసెంబర్ 31న బెంగళూరులో 'సన్నీ నైట్స్' పేరుతో ఓ వేడుక జరగాల్సి ఉంది. ఈ వేడుక నిర్వహణ కోసం డిసెంబర్ 1వ తేదీనే ఈవెంట్ నిర్వాహకులు 'టైమ్స్ క్రియేషన్స్' పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. మొదట పోలీసులు ఇందుకు అనుమతించారని, తర్వాత ఓ పది మంది వచ్చి సన్నీ బెంగళూరు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో అనుమతి రద్దు చేశారని టైమ్స్ క్రియేషన్స్ ప్రతినిధి హరీష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి ఈవెంట్లే 50కి పైగా జరుగుతున్నాయని, వాటి మీద ఎలాంటి చర్యా తీసుకోలేదని హరీష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.