babu gogineni: హేతువాది బాబు గోగినేని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. టీవీ లైవ్లోంచి వెళ్లిపోయిన జ్యోతిష్కుడు వేణుస్వామి!
- ప్రధాని మోదీతో ఫొటో దిగినట్లు జ్యోతిష్కుడు వేణు స్వామి మార్ఫింగ్ ఫొటో
- అది అసత్యమని చెప్పిన పీఎంవో
- ఈ జ్యోతిష్కుడు ఎన్నో విషయాలు చెబుతున్నారు
- ఏదో ఒకటి నిజం అవుతోంది.. అది సహజమే: గోగినేని బాబు
ప్రధానమంత్రితో దిగినట్లు ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి తన ఫేస్బుక్ లో ఓ పోస్ట్ చేసుకున్నాడు. గుత్తికొండ కల్యాణ్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ప్రధానమంత్రి ఆఫీస్‌కి ఆ ఫొటో నిజమా? కాదా? అని దరఖాస్తు చేశారు. దీంతో ఆ ఫొటో అసత్యం అని ఆయనకు ఓ లెటర్ వచ్చింది. ఈ విషయాన్ని తెలిపి.. జ్యోతిష్కుడు వేణు స్వామి చేస్తోన్న పలు మోసాలను, ప్రజలను మభ్యపెడుతూ డబ్బు సంపాదించుకుంటోన్న తీరును ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఓ టీవీ న్యూస్ చర్చా కార్యక్రమంలో బయటపెట్టారు.
వేణు స్వామి దేశంలో ఏ ప్రముఖుడిని వదలడం లేదని, సినీనటులు, రాజకీయనాయకులను గురించి ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారని బాబు గోగినేని చెప్పారు. ఓ రాజకీయ నాయకుడు చనిపోతాడని, ఒకరికి ఆరోగ్యం బాగుండదని, ఒకరు లేచిపోయి పెళ్లి చేసుకుంటారని ఎన్నో వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. చివరికి తెలుగు బిగ్‌బాస్ షోను కూడా వదలలేదని, శివబాలాజీ గెలవబోడని, నవదీప్ గెలుస్తాడని చెప్పాడని అన్నాడు. అది నిజం కాలేదని చెప్పారు.
పేర్లు 'ఏ' అక్షరం లేక 'వీ' అక్షరంతో ప్రారంభం అయితే వారి చుట్టూ యమగండం తిరుగుతుందని అన్నారని, జయలలిత మృతి చెందినప్పుడు కూడా నీచంగా తప్పుడు ప్రచారం చేసుకున్నారని అన్నారు. "హిమాలయాల్లో, కలకత్తాల్లో ప్రకృతి బీభత్సం, చైనాలో కరవు వస్తాయన్నాడు. ఇటలీలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దారుణంగా మారుతుందన్నారు.. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం చెబుతాడు. ఎన్నో రాళ్లు వేస్తున్నారు. ఒక్క రాయయినా తగులుతుంది. తాను చెప్పినట్లే అది జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన చెప్పిన వీడియోలు, చేసిన ప్రకటనలు అన్నీ కలిపి అవి తప్పని నిరూపిస్తూ త్వరలోనే ఓ పుస్తకం విడుదల చేస్తున్నాం. కేసీఆర్‌కి 2014లో రాజయోగం లేదని అన్నారు. కేసీఆర్ చక్కగా ముఖ్యమంత్రి అయ్యారు. చిరంజీవి 150వ సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నాడు. ఆయన చెప్పిన విషయాల్లో 100లో 98 విషయాలు నిజం కాలేదని అన్నారు. దేశంలోని ప్రముఖులపై, వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి వ్యాఖ్యలు చేయడానికి ఆయనకు హక్కు ఎక్కడిది?" అని బాబు గోగినేని అన్నారు.
బాబు గోగినేని పలు ఆధారాలను చూపుతూ ప్రశ్నలు అడుగుతుండడంతో జ్యోతిష్కుడు వేణు స్వామి మాట్లాడుతూ... "నన్ను నమ్మండి.. నమ్మకండి. ఈ చర్చలో బాబు గోగినేని చెప్పిన విషయాలను మాత్రమే నమ్మండి.. హిందూ మతాన్ని, జోతిష్యాన్ని బాబు గోగినేని కించపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాకు జ్యోతిష్యం రాదని అనేవారు నన్ను నమ్మకండి.. నేను లైవ్‌లోకి వచ్చానని తెలుసుకుని బాబు గోగినేని కావాలనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన చెప్పిందే నమ్మండి. నేను చెప్పేది ఏవీ నిజాలు కావు.." అంటూ విచిత్రంగా మాట్లాడి దండం పెట్టేసి వెళ్లి పోయారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారుతోంది.