YSRCP: రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడు చేస్తాం: వైసీపీ ఎంపీలు
- ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన వైసీపీ ఎంపీలు
- మేము రాజీనామా చేస్తే ఏపీ ప్రయోజనాలపై ప్రశ్నించడానికి ఎవ్వరూ ఉండరు
- పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరాం
- 2019 కల్లా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారు
రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడు తాము రాజీనామా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు. ఒకవేళ తాము రాజీనామా చేస్తే ఏపీ ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం ఎవ్వరూ ఉండబోరని అన్నారు. ఈ రోజు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ... పోలవరం నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరినట్లు చెప్పారు. అయితే, 2019 కల్లా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారని అన్నారు. అలాగే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించవద్దని గడ్కరీని కోరామని తెలిపారు.