Sachin Tendulkar: నిన్న రాజ్యసభలో మాట్లాడనివ్వనందుకు.. ఈ రోజు ఫేస్‌బుక్‌లో మాట్లాడిన సచిన్!
- నిన్న రాజ్యసభలో మాట్లాడాలనుకున్న దాన్ని ఈ రోజు మాట్లాడుతున్నా
- క్రీడలను ప్రేమించే దేశంగా కాకుండా క్రీడలను ఆడే దేశంగా భారత్ మారాలి
- ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలి
- ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెంపొందుతాయి
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నిన్న రాజ్యసభలో ప్రసంగం చేయడానికి సిద్ధమవ్వగా అదే సమయంలో సభలో నిరసనలతో నినాదాలు హోరెత్తిన విషయం తెలిసిందే. తోటి సభ్యులు రాజ్యసభలో అడ్డుపడినందుకు గానూ సచిన్ టెండూల్కర్ తన సందేశాన్ని అందించడానికి ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకున్నారు. నిన్న రాజ్యసభలో తాను మాట్లాడాలనుకున్న దాన్ని ఈ రోజు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతున్నానని చెప్పారు. మనిషి జీవనంలో క్రీడలు, ఫిట్‌నెస్‌కు ఉన్న ఆవశ్యకతను తెలిపారు.
క్రీడలను ప్రేమించే దేశంగా కాకుండా క్రీడలను ఆడే దేశంగా భారత్ మారాలని సచిన్ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని చెప్పారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని అన్నారు. మన కలలు నిజం కావాలని, ప్రయత్నిస్తే కలలు నిజమవుతాయని సందేశం ఇచ్చారు. తాను ఆటలు ఆడడాన్ని ఇష్టపడతానని చెప్పారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ ఒక కవి, రచయిత అని, ఆయన తనకు స్వేచ్ఛనిచ్చి లక్ష్య సాధనకు సాయం చేశారని చెప్పారు.