sandya rani: సంధ్యారాణికి నా కుమారుడు ఫోన్ కొనిచ్చాడు.. బైకుపై షాపింగ్‌కు తీసుకెళ్లేవాడు: కార్తీక్ తల్లి
- నా కుమారుడు ఇంట్లో ఏవీ పట్టించుకోకుండా ఆమె వెంట తిరిగేవాడు
- సంధ్యారాణి తప్పు కూడా ఉంది
- పదే పదే ఫోన్ చేసేది
- నా కొడుకుని పెళ్లి చేసుకోనని చెప్పింది
నిన్న హైదరాబాద్‌లో సంధ్యారాణి అనే యువతిని కార్తీక్ అనే యువకుడు పెట్రోల్‌పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కార్తీక్ తల్లి ఊర్మిళ మీడియాతో మాట్లాడారు. తన బావ తిడుతున్నాడని చెప్పి సంధ్యారాణి కొన్ని నెలలుగా తన కొడుకుని కలవడం లేదని, అయితే మళ్లీ కొన్ని రోజుల నుంచి సంధ్యారాణి వాడికి ఫోన్ చేస్తోందని తెలిపారు. ఆమెకి తన కొడుకు ఫోన్, చీర కొనిచ్చాడని చెప్పారు. తమ ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ తన కుమారుడు అవేవీ పట్టించుకోకుండా ఆమె వెంట తిరిగేవాడని తెలిపారు. ఇంట్లో నుంచి పదివేలు తీసుకెళ్లి సంధ్యారాణికి తన కుమారుడు ఫోన్ కొనిచ్చాడని అన్నారు.
అతని నుంచి ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నావని అప్పుడు తమ కూతురిని అడగని సంధ్యారాణి కుటుంబ సభ్యులు ఇప్పుడు మాత్రం ఎన్నో మాట్లాడుతున్నారని అన్నారు. తమ కుమారుడి బైకుపై ఆ అమ్మాయి తిరిగేటప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆమె అడిగారు. అవసరం ఉన్నప్పుడు తమ కుమారుడికి ఫోను చేసి బైకు ఎక్కి వెళుతుందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సంధ్యారాణి తనకు ఫోన్ చేసి, కార్తీక్ తనని టార్చర్ పెడుతున్నాడని చెప్పిందని అన్నారు. పెళ్లి చేసుకుంటావా? అని తాను ఆమెను అడిగితే, చేసుకోనని చెప్పిందని అన్నారు.
మరి తన కుమారుడితో ఎందుకు తిరుగుతున్నావని అడిగానని, తన కుమారుడిని ఇక వదిలేయాలని చెప్పానని కార్తీక్ తల్లి అన్నారు. కొన్ని రోజులు గొడవ పెట్టుకుంటుందని, మళ్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రం తన కుమారుడికి ఫోన్ చేస్తుందని తెలిపారు. ఆమెను తన కుమారుడు పదే పదే షాపింగ్‌కు తీసుకెళుతుండేవాడని ఆమె చెప్పారు. ప్రతి రోజు ఛాటింగ్ చేసుకుంటారని, వీడియో కాల్ మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ మధ్య తన కుమారుడు ఫోన్ చేస్తే కట్ చేస్తోందని, తాను పనిచేస్తోన్న యజమానితో తన కుమారుడిని తిట్టించిందని అన్నారు. తన కుమారుడు పెట్రోల్ పోసి ఆమెను తగులబెట్టడం తప్పేనని, కానీ, సంధ్యారాణిది తప్పులేనట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.