Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, వైసీపీలు బురద చల్లుకోవడం మానుకోవాలి: పవన్ కల్యాణ్
- కులం, కారణం ఏదైనా కావచ్చు.. మహిళపై దాడి అమానుషం
- ఇలాంటివి జరగకుండా అసెంబ్లీలో చర్చ జరగాలి
- బాధితురాలి వద్దకు జనసేన కార్యకర్తలను పంపిస్తా
విశాఖపట్నంలోని ఓ భూవివాదం కేసులో ఓ దళిత మహిళపై రాజకీయ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డ సంగతి తెలిసిందే. నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసేందుకు వీరు ప్రయత్నించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందన్న వాస్తవాలను సేకరించేందుకు విశాఖపట్నంలోని జనసేన కార్యకర్తలను పంపుతానని ఆయన ట్వీట్ చేశారు.
భాధితురాలిని వీరు కలిసి, జరిగిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళతారని చెప్పారు. బాధితురాలికి అండగా నిలవాలని కోరుతూ యూరప్, అమెరికా నుంచి వివిధ వర్గాలకు చెందిన ఎంతో మంది ఎన్నారై మహిళలు తనకు మెసేజ్ లు పంపుతున్నారని తెలిపారు. కులం ఏదైనా కానీ, కారణం ఏదైనా కానీ ఓ మహిళపై దాడి చేయడం సమర్థించాల్సిన విషయం కాదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మానేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దానిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.