raghu: నేనైనా ఉండాలి .. వాడైనా ఉండాలి అనుకున్నాను: కమెడియన్ రఘు
- కాలేజ్ నుంచి నేపాల్ టూర్ నేను ఆర్గనైజ్ చేశాను
- అది ఒకడికి నచ్చక రచ్చ చేశాడు
- నేపాల్ నుంచి వస్తుండగా నాపై పగ తీర్చుకున్నాడు
- ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాను
తాజాగా ఐ డ్రీమ్స్ తో కమెడియన్ రఘు మాట్లాడుతూ, కాలేజ్ డేస్ లో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. "కాలేజ్ లో నేను ఫైనలియర్లో వుండగా, నేపాల్ టూర్ కి ప్లాన్ చేశాం. ఆ టూర్ ను ఆర్గనైజ్ చేసే బాధ్యతను ఫ్రెండ్స్ నాకు అప్పగించారు. అది ఒకడికి నచ్చలేదు .. వాడు తోపుగిరి మాటలు మాట్లాడినా .. కూర్చోబెట్టి నచ్చజెప్పడం జరిగింది. అయినా వాడు అది మనసులో పెట్టుకున్నాడు .. ఇక్కడ ఏం చేయలేక సమయం కోసం ఎదురుచూస్తున్నాడు"
"నేపాల్ నుంచి వస్తుండగా, ఒక చెక్ పోస్ట్ వారికి నా గురించి తప్పుడు సమాచారం అందించాడు. నేను .. మా నాన్న ఆర్మీకి సంబంధించిన రగ్గులు .. చలికోటు తీసుకెళ్లాను. అవి చూసి అక్కడి వాళ్లు నన్ను అపార్థం చేసుకుని .. లోపలేసి నాలుగు తగిలించారు. నేను 'స్పై' అనుకున్నారు .. ఇక లాంగ్వేజ్ ప్రోబ్లం ఉండనే వుంది.. లోపలికి ఎవరినీ రానీయరు.
చివరికి నా 'ఐడీ కార్డ్స్' అవీ ఇవీ చూసి వదిలిపెట్టారు. నన్నలా ఇరికించిన వాడిపై నాకు చాలా కోపం వచ్చింది. నా విషయం తెలిసి మిగతా వాళ్లు వాడిని అక్కడి నుంచి తప్పించారు. వాడిని ఏదో ఒకటి చేయాలనుకున్నాను .. నేనైనా ఉండాలి .. వాడైనా ఉండాలి అనుకున్నాను. కానీ ఆ తరువాత తరువాత ఆ గొడవ సద్దుమణిగిపోయింది" అన్నారు.