bus: బస్సుని నడిపిన 16 ఏళ్ల కుర్రాడు.. వంతెన పై నుంచి పడిన వైనం.. 32 మంది మృతి!
- రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ దుబి ప్రాంతంలో ఘటన
- సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు
- గాయాలపాలైన వారికి ఆసుపత్రుల్లో చికిత్స
- మోదీ సంతాపం
రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ దుబి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతోన్న ఓ బస్సు అదుపు తప్పి వంతెన పై నుంచి నదిలో పడి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బస్సు లాల్ సోత్ ప్రాంతం నుంచి సవాయ్ మాధోపూర్ వచ్చిందని, ఆ బస్సును నడిపే డ్రైవర్.. 16 ఏళ్ల కుర్రాడైన కండక్టర్ని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి బస్సు నడపమని చెప్పి, తను పడుకున్నాడని పోలీసులు తెలిపారు. స్టీరింగ్ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆ కండక్టర్, డ్రైవర్ కూడా మృతి చెందారని పోలీసులు చెప్పారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు మొదలు పెట్టిందని ట్వీట్ చేశారు.