smartphone: స్మార్ట్‌ఫోన్‌ను నిఘా యంత్రంగా మార్చే యాప్.. రూపొందించిన ఎడ్వర్డ్ స్నోడెన్!
- 'హెవన్' పేరుతో బీటా వెర్షన్ విడుదల
- జర్నలిస్టులు, సామాజికవాదులకు ఉపయోగం
- అనుమానాస్పదంగా చొరబడే వారిని గుర్తించే యాప్
సీఐఏ మాజీ ఉద్యోగి, ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఫౌండేషన్ అధ్యక్షుడు, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, కొంతమంది సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఓ యాప్‌ను రూపొందించారు. దీని పేరు 'హెవన్'. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ఓ చిన్న సైజు నిఘాయంత్రంగా మారుతుంది. జర్నలిస్టులు, సామాజికవాదులు, ప్రభుత్వంతో వాదించాలనుకునేవారికి ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్నిరకాల సెన్సార్‌లను ఉపయోగించి ఈ యాప్ పనిచేస్తుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ చుట్టుపక్కల ప్రదేశంలో ఏ చిన్న మార్పు చోటు చేసుకున్నా దానిని రికార్డు చేస్తుంది. ఉదాహరణకు ముఖ్యమైన సమాచారం ఉన్న ల్యాప్‌టాప్‌ను ఏదైనా లాకర్‌లో పెట్టి వెళ్లారనుకోండి. దాన్ని ఎవరు వాడారో తెలుసుకోవడం కష్టం. కానీ ఆ ల్యాప్‌టాప్ మీద 'హెవన్' యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంచితే.. ఫొటో, వీడియో, వాయిస్, కాంతిలో తేడాలు వంటి విషయాలన్నింటినీ రికార్డు చేసి ప్రైమరీ ఫోన్‌కి పంపిస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ఇంటర్నెట్ లేకపోయినా, మరేదైనా సమస్య వచ్చినా ఫోన్ మెమొరీలో రికార్డు చేసుకుంటుంది. తర్వాత ఒక చిన్న లాగిన్ ద్వారా ఆ సమాచారాన్ని తిరిగి తీసుకోవచ్చు.