karnataka elections: మోదీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న కర్ణాటక.. గుజరాత్ పరిణామాల నేపథ్యంలో మోదీ, షా అలర్ట్
- గుజరాత్ పరిణామాలతో మోదీ, అమిత్ షాలు అలర్ట్
- కాంగ్రెస్ బీజేపీ నేతలపై నెగెటివ్ రిపోర్ట్
- 18 ర్యాలీలకు సిద్ధమవుతున్న మోదీ
సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు మధ్య బీజేపీ గెలవడం ప్రధాని మోదీకి, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు మింగుడు పడటం లేదు. దీంతో, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు బీజేపీకి ఆధిపత్యానికి కీలకం కానున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో పాగా వేయడం ఆ పార్టీకి ఎంతో ముఖ్యం. కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకోకపోతే... దక్షిణాదిలో బీజేపీ ప్రాభవం ఏమాత్రం పెరిగే అవకాశం ఉందడు. ఇదే సమయంలో, మోదీ చరిష్మా తగ్గిందనే ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, కర్ణాటకపై మోదీ, అమిత్ షాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నారు. నాలుగు నెలల వ్యవధిలో కర్ణాటకలో 15 నుంచి 18 ర్యాలీలు, సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. గుజరాత్ పరిణామాల నేపథ్యంలో, కర్ణాటకలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారనే నివేదికలు అందిన నేపథ్యంలో... గెలుపు బాధ్యతలను మోదీ, అమిత్ షాలే తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.