smallest: ప్రపంచంలో అతి చిన్న క్రిస్‌మస్ గ్రీటింగ్ కార్డు... రూపొందించిన శాస్త్రవేత్తలు
- 15 మైక్రోమీటర్ల వెడల్పు మాత్రమే
- సూక్ష్మదర్శినితో మాత్రమే చూసే అవకాశం
- లండన్‌లోని ఎన్‌పీఎల్ ల్యాబ్‌లో తయారీ
కేవలం 15 మైక్రోమీటర్ల వెడల్పు ఉన్న అతిచిన్న క్రిస్‌మస్ గ్రీటింగ్ కార్డును లండన్‌లోని నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ (ఎన్‌పీఎల్) శాస్త్రవేత్తలు తయారుచేశారు. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ గ్రీటింగ్ కార్డు మీద ఒక మంచు మనిషి బొమ్మతో పాటు 'సీజన్స్ గ్రీటింగ్స్' అనే అక్షరాలను కూడా ముద్రించారు. ఈ అక్షరాలను చూడాలంటే మైక్రోస్కోప్ తప్పనిసరి.
ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే ప్లాటినం కోటెడ్ సిలికాన్ నైట్రైడ్ ఉపయోగించి ఈ గ్రీటింగ్ కార్డును తయారుచేశారు. నానో స్కేల్ ప్లేట్స్ రూపొందించే ప్రత్యేక పరికరాల ద్వారా ఈ గ్రీటింగ్ కార్డును రూపొందించారు. తాము ఈ రంగంలో చేస్తున్న కృషిని గుర్తుచేసేలా ఈ గ్రీటింగ్ కార్డుని తయారుచేశామని ఎన్‌పీఎల్ శాస్త్రవేత్త డేవిడ్ కాక్స్ తెలిపారు.