allu aravind: చిరంజీవితో ఒక్కసారి మాత్రమే టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి: అల్లు అరవింద్
- చిరంజీవికి సంబంధించి చిన్నిచిన్ని బాధ్యతలను నేను తీసుకున్నా
- దాంతో ఆయన నటనపై పూర్తిగా కాన్సెంట్రేట్ చేయగలిగారు
- రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి
మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ లు కేవలం బావాబావమరిదిలు మాత్రమే కాదు అంతకు మించి మంచి స్నేహితులు కూడా. తమ మధ్య ఉన్న అనుబంధం గురించి సాక్షి పత్రికతో అరవింద్ పంచుకున్నారు. చిరంజీవి తనను ఎంతో నమ్మారని... ఆ నమ్మకాన్ని తాను బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. తెరవెనుక ఉన్న చిన్నిచిన్ని బాధ్యతలను తాను స్వీకరించానని... దీంతో, ఆయన సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయగలిగారని తెలిపారు. దీంతో మనసులో రెండో ఆలోచనకు తావు లేకుండా ఆయన నటించగలిగారని చెప్పారు. తనకు చేతనైనంతలో చిరంజీవికి తాను చేసిన సాయం ఇదేనని చెప్పారు.
సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు కలసి కొనసాగినవారు చాలా అరుదని... తనకు గుర్తున్నంత వరకు అలాంటి వారిలో బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి, చిరంజీవి-తాను ఉన్నామని అరవింద్ చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా స్ట్రాంగ్ అండర్ స్టాండింగ్ ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు. వ్యక్తిగతంగా తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని... ఆయన రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు మాత్రం చిన్నిచిన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయని చెప్పారు. అవి కూడా తమపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని... ఎప్పటిలాగానే తామిద్దరం కలిసే ముందుకు సాగుతున్నామని తెలిపారు.