Ys: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేస్తానని ఆరోజున ఆయనకే చెప్పాను: కందుల రాజమోహన్ రెడ్డి
- 1994లో మా సోదరుడు ఓడిపోవడానికి కారణం వైఎస్
- నాడు మా ఊరి పంచాయతీ ఎన్నికలప్పుడు వైఎస్ వచ్చారు
- నీ మీద ఈసారి పోటీ చేస్తానని అప్పుడే వైఎస్ కు చెప్పా
1996 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేస్తానని ఆరోజున ఆయనకే చెప్పానని నాడు టీడీపీ తరపున పోటీ చేసిన కందుల రాజమోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కడప జిల్లా బీజేపీ నేతగా ఉన్న ఆయన ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను మొదటి నుంచి రాజకీయ విశ్లేషణ చేసుకుంటాను. 1991లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు నాలుగు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిచారు. ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని, అది ప్రజాభిప్రాయం కాదని, ఒక రకమైన వాతావరణంలో ఇటువంటి ఫలితాలు వస్తున్నాయనే ఫీడ్ బ్యాక్ మాకు ఉండేది. ఏ రాజకీయ నాయకుడైనా దౌర్జన్యంగా కానీ, ఇంకో విధంగా గానీ ఓట్లు వేయించుకుంటే.. ప్రజలు బయటపడకపోయినప్పటికీ వాళ్లలో తిరుగుబాటు తనం ఉంటుంది.
1996లో రాష్ట్రంలో టీడీపీ మెరుగైన పరిస్థితుల్లో ఉంది. అందువల్ల, వైఎస్ పై పోటీ చేస్తే గట్టిపోటీ ఇవ్వగలననే నమ్మకం, ధైర్యం నాకు ఉండేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలని ఎందుకు అనుకున్నామంటే .. కాంగ్రెస్ లో పెద్ద నాయకుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి 1994లో మా సోదరుడు శివానందరెడ్డిని ఓడించేందుకు ప్రయత్నించారు. ఆ రోజున టీడీపీ అభ్యర్థి అయిన ఖలీల్ బాషా గారికి సపోర్టు చేశారు. దీంతో, నాలుగైదు వేల ఓట్ల తేడాతో కడపలో శివానందరెడ్డి ఓడిపోయారు.
ఈ సంఘటనే కాకుండా మరో సంఘటన గురించి చెప్పాలి. నాడు మా ఊరు వెలమారిపల్లి పంచాయతీ ఎన్నికల్లో మా మిత్రుడు ఒకరు పంచాయతి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ వైపు నుంచి ఇంకో అభ్యర్థిని ఈ ఎన్నికల్లో పోటీగా ఉంచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు, వాళ్ల కుటుంబసభ్యులు మా ఊరు వచ్చారు. ఆ రోజున రాజశేఖర్ రెడ్డిని అడిగాను. ‘మా ఊరు కూడా కావాల్సి వచ్చిందా?, నీ మీద ఈసారి నేను పోటీ చేస్తాను’ అని ఆరోజునే ఆయనకు చెప్పాను’ అని కందుల నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు.