maoist: నలభై ఏళ్ల తర్వాత తన తల్లిని కలిసిన జంపన్న.. ఉద్వేగానికి గురైన వైనం!
- వరంగల్ లోని సహృదయ ఆశ్రమంలో జంపన్న తల్లి యశోదమ్మ
- మిగిలిన జీవితాన్ని నా తల్లితో గడుపుతా
- ప్రజా జీవితానికి అలవాటు పడేందుకు సమయం పడుతుంది
మావోయిస్టు సీనియర్ నేత జంపన్న అలియాస్ నరసింహారెడ్డి, తన భార్య రజితతో కలిసి ఈ రోజు తెలంగాణా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, వరంగల్ లోని సహృదయ ఆశ్రమంలో ఉన్న తన తల్లి యశోదమ్మను జంపన్న కలిశారు.
నలభై ఏళ్ల తర్వాత తన తల్లిని కలిసిన ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.. కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి ప్రేమ వెలగట్టలేనిదని, మిగిలిన జీవితాన్ని తన తల్లితో గడపాలని అనుకుంటున్నానని, సాధారణ జీవితం గడుపుతూ, పీడిత ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పారు.
ప్రజాజీవితానికి అలవాటు పడాలంటే సమయం పడుతుందని అన్నారు. ఉద్యమంపై ప్రేమ తగ్గి తాను లొంగిపోలేదని, పార్టీతో సైద్ధాంతికంగా విభేదించానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు మార్చుకోవాలని సూచించానని, పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని తాను అనడం లేదని, తన లొంగుబాటుపై పార్టీలో చర్చ జరుగుతోందని అన్నారు.