Jagan: వైసీపీలో ఉత్కంఠ.. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము దూరం అన్న జగన్.. పోటీ చేసి తీరుతానంటున్న గౌరు!
- ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా వైసీపీ
- అవసరమైతే ఇండిపెండెంట్ గా దిగేందుకు కూడా సిద్ధమన్న గౌరు
- వైసీపీలో డైలమా
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ పోటీ నుంచి తాము తప్పుకుంటున్నట్టు వైసీపీ నిన్న ప్రకటించింది. అయితే, పోటీలో నిలబడతానని, పార్టీ తరపున నామినేషన్ వేస్తానంటూ ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి పట్టుబడుతున్నారు. తన వెనుక 1,080 మంది స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఉందని, తాను గెలిచే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో, జగన్ తో ఈ విషయంపై చర్చించేందుకు ఆయన గార్లపెంట చేరుకున్నారు. తన దగ్గరున్న లెక్కలను జగన్ కు చూపించి, ఎన్నికల బరిలో దిగేందుకు ఒప్పించాలని గౌరు ప్రయత్నిస్తున్నారు.
అయితే, గౌరు ప్రతిపాదనను జగన్ ఎంతవరకు ఒప్పుకుంటారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. మరోవైపు, జగన్ ఒప్పుకోకపోతే... ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు కూడా గౌరు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో, వైసీపీలో పూర్తి స్థాయిలో డైలమా నెలకొంది. కాపేసట్లో ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈ సాయంత్రం 5 గంటలు కావడం గమనార్హం.