rajanikanth: ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. రాజకీయం నాకు కొత్త కాదు.. 31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తా: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్
- స్వయంగా చెప్పిన తలైవా
- ఒక్కసారి యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలి
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న పరిణామాలు వాస్తవ రూపం దాల్చేందుకు సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అనిపిస్తోంది. ఈ మేరకు స్వయంగా రజనీకాంత్ సంకేతాలు ఇచ్చారు. అభిమానులతో నేటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కొనసాగే ఈ సమావేశాల చివరి రోజున ఆయన పార్టీని ప్రకటించనున్నారు.
సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయాలు కొత్త కాదని అన్నారు. 1996 నుంచి రాజకీయాలను చూస్తూనే ఉన్నానని... ఇప్పటికే చాలా ఆలస్యం అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి యుద్ధంలోకి దిగితే... గెలిచి తీరాలంటూ తన అభిమానులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు. సూపర్ స్టార్ కావాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లోకి రాలేదని చెప్పారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీపై రజనీ స్పష్టతనివ్వడంతో, ఆయన అభిమానులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.