noor mohammed: మూడడుగుల ముష్కరుడిని కాల్చి చంపిన సైన్యం!
- జైషే కమాండర్ నూర్ హతం
- కాన్వాయ్ పై దాడికి వచ్చిన నూర్ ను కాల్చి చంపిన సైన్యం
- గత మూడు నెలల్లో 15 మంది ముఖ్య నేతలు హతం
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తాంగ్రే అలియాస్ చోటా నూరాను ఈ తెల్లవారుజామున భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఆయన వయసు 47 ఏళ్లు. విశేషం ఏమిటంటే, ఇతను కేవలం మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు. జైషే కమాండర్ గా భద్రతాబలగాలకు నిద్రలేకుండా చేశాడు నూర్. శ్రీనగర్ విమానాశ్రయం వద్ద గల బీఎస్ఎఫ్ క్యాంప్ పై దాడి వెనుక నూర్ హస్తముందనే రిపోర్టులు ఉన్నాయి. 2015లో జైషే మహ్మద్ లో నూర్ చేరాడు. ఆ తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన ప్రతి ఉగ్ర చర్య వెనుక అతనికి సంబంధాలు ఉన్నాయి.
శ్రీనగర్-జమ్ము హైవేపై వెళ్తున్న భద్రతా బలగాల కాన్వాయ్ పై దాడి చేసేందుకు ఈ తెల్లవారుజామున నూర్ వచ్చాడు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో... నూర్ ను సైనికులు కాల్చి చంపారు. 2003లో నూర్ ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2015లో పెరోల్ పై వచ్చిన అతను... జైషే మహ్మద్ లో చేరాడు. గత మూడు నెలల్లో 15 మంది జైషే ముఖ్య నేతలను సైన్యం మట్టుబెట్టడం గమనార్హం.