Pawan Kalyan: ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు అండగా నిలవాలి: పవన్ కల్యాణ్
- ఫాతిమా కళాశాల విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు
- యాజమాన్యం తప్పిదం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదు
- విద్యార్థులకు న్యాయం జరగాలి
ఫాతిమా కళాశాల విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని, యాజమాన్యం తప్పిదం వల్ల అమాయకులైన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన ట్విట్టర్ ద్వారా ఫాతిమా కళాశాల విద్యార్థుల దుస్థితి గురించి స్పందించారు. మనం కోల్పోయే ప్రతీ గంట సమయం మన భవిష్యత్‌ను దురదృష్టకరం చేసుకోవడమే అవుతుందని నెపోలియన్ అన్నారని పవన్ పేర్కొన్నారు. బాధ్యతరాహిత్యం, అత్యాశ కలిగిన ఫాతిమా కాలేజీ యాజమాన్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.
ఎంతో తెలివిగల ఫాతిమా విద్యార్థులు చాలా బాధ పడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు చేశారని, కానీ వారి బాధను గుర్తించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేశాయని పవన్ మండిపడ్డారు. ఫాతిమా మెడికల్ కళాశాల చేసినట్లు విదేశాల్లో జరిగితే జరిమానా విధించి, అనుమతులను రద్దు చేసి, మేనేజ్మెంట్ను జైలుకు పంపేవారని పవన్ కల్యాణ్ అన్నారు. సదరు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ కాలేజీలో చేర్పించారని, విద్యార్థులు ఎంతో శ్రమ పడి ఫాతిమా కళాశాలో విద్యను పూర్తి చేశారని, కళాశాల యాజమాన్యం చేసిన తప్పిదంతో కష్టాలను ఎదుర్కుంటున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని, వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ కోరారు.