paripoornananda: అందుకే, కంచ ఐలయ్య రాసిన పుస్తకాలను కాల్చొద్దని చెప్పాను: స‌్వామి పరిపూర్ణానంద
- నాడు నలంద, తక్షశిల విద్యాలయాల్లో తురుష్కులు మన గ్రంథాల్ని కాల్చారు
- అటువంటి పనులు మనం చేయకూడదు
- పుస్తకం అంటే సరస్వతి.. పుస్తకాల్ని తగులబెట్టకూడదు
- విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగడం శోచనీయం
పుస్తకాల్ని కాల్చేవారికి మస్తకం లేదని రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇటీవల ఓ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిని తగులబెట్టే ప్రయత్నం చేశారని, విశ్వవిద్యాలయాలుగా ఉండాల్సినవి.. విష విద్యాలయాలుగా మారడం శోచనీయమని అన్నారు. విద్యాలయాల్లో గ్రంథాల్ని పరిరక్షించాలని, అంతేకానీ, తగలబెట్టడం కాదని అన్నారు. పుస్తకాన్ని కాల్చడం ఆటవికతనానికి నిదర్శనమని చెప్పారు.
ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... "మనుస్మృతినే కాదు, ఏ పుస్తకాన్నీ కాల్చడానికి వీల్లేదు.. అంతర్జాతీయ కుట్రలో భాగస్వామి అయిన కంచ ఐలయ్య హిందూత్వం మీద, కులాల మీద పుస్తకాలు రాశారు. ఇటీవలి కాలంలో ఆ పుస్తకాల్ని తగులబెడతామని ఒకాయన అన్నారు. నేను వద్దని చెప్పాను. అటువంటివి ప్రేరేపిస్తోన్న వారు చేస్తోన్న కుట్రలను ఖండించాలి.
ఖురాన్, బైబిల్, భగవద్గీతలనయినా కాల్చకూడదు. కాల్చేవారి మస్తిష్కాలు బాగోలేవు కాబట్టే పుస్తకాలను కాల్చుతున్నారు. మనకి ఇటువంటి దాడులు కొత్త కాదు.. నాడు నలంద, తక్షశిల విద్యాలయాల్లో తురుష్కులు మన గ్రంథాల్ని కాల్చారు. అటువంటి పనులు మనం చేయకూడదు. పుస్తకం అంటే సరస్వతి.. పుస్తకాల్ని తగులబెట్టకూడదు. విశ్వవిద్యాలయాల్లో పుస్తకాలను తగులబెట్టకూడదు. వాటిని విష విద్యాలయాల్లా మార్చకూడదు.. భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం పుస్తకాలను తగులబెట్టడం కాదు.." అని పరిపూర్ణానంద అన్నారు.