Kulbhushan Jadhav: కుల్‌భూషణ్ తల్లిపై పాక్ మీడియా అనుచిత వ్యాఖ్యలు!
- కుల్‌భూషణ్ తల్లిని హంతకుడి తల్లిగా పేర్కొన్న పాక్ మీడియా
- ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
- కుమారుడిని కలిసిన సందర్భంలోనూ ఆంక్షలు
మరణశిక్షకు గురై ప్రస్తుతం పాక్ జైల్లో వున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లిపై పాక్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఆంక్షల తర్వాత కుల్‌భూషణ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్‌కుల్ జాదవ్‌లకు అనుమతి ఇచ్చిన పాక్ అక్కడ కూడా ఆంక్షలు విధించింది. కుమారుడిని నేరుగా కలవకుండా గాజు తెర అడ్డంగా పెట్టింది.
తాజాగా పాక్ మీడియా జాదవ్ తల్లిపై నోరు పారేసుకుంది. ఆమెను హంతకుడి తల్లి (ఖాతిల్ కా మా) అని సంబోధించి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం బయటే ఈ వ్యాఖ్యలు చేసింది. కుల్‌భూషణ్ తల్లి, భార్యను కారులో కూర్చెబెట్టిన సమయంలో జర్నలిస్టులు ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ మీడియా తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్ జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాక్ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ వెనక్కి తగ్గింది. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అతడి ఉరిపై స్టే విధించింది.