Chennampalli Fort: ట్రెజర్ హంట్ అప్ డేట్: చెన్నంపల్లి కోటలో రెండు సొరంగాలు
- సొరంగాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో తెలియదు
- భూగర్భంలో మెటల్ ఉన్న మాట వాస్తవమే
- అది ఏంటో కనుగొనడమే లక్ష్యమంటున్న అధికారులు
కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచివుంచిన నిధి కోసం జరుగుతున్న తవ్వకాలు రెండు వారాలను దాటి మూడో వారానికి అడుగు పెట్టాయి. తాజాగా ఈ కోటలో కనీసం రెండు సొరంగాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇవి ఎంతవరకూ దారితీస్తున్నాయన్న విషయాన్ని ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ కోటలోని భూగర్భంలో మెటల్ ఉన్న మాట వాస్తవమని, అది ఏంటన్నది కనుగొనడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.
భారీ బందోబస్తు మధ్య గత 14 రోజులుగా తవ్వకాలు సాగగా, తొలి నాళ్లలో అస్థిపంజరాలు, ఆపై ఖడ్గాలు, ఏనుగు దంతాలు తదితరాలు లభించిన సంగతి తెలిసిందే. ఈ కోటలో భారీ నిధి ఉందని ఇక్కడి వారు బలంగా విశ్వసిస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ పురావస్తు, మైనింగ్ శాఖల అధికారులు స్వయంగా రంగంలోకి దిగి నిజానిజాలను వెలికితీసే పనిలో పడగా, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. తవ్వకాల ప్రక్రియ ఆసాంతమూ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.