hyderabad metro rail: ప్రయాణికులకు మెట్రో షాక్.. మెట్రోకు ప్రయాణికుల షాక్!
- నిర్ణీత సమయంలో గమ్యస్థానాలకు చేరని మెట్రో రైళ్లు
- స్టేషన్లలో నిమిషాల పాటు ఆగుతున్న రైళ్లు
- సరదా కోసమే ఎక్కువ మంది మెట్రో ప్రయాణం
హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రో రైల్ షాక్ ఇస్తోంది. నిర్ణీత సమయంలోగా మెట్రో రైళ్లు గమ్యస్థానం చేరడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణానికి కూడా రెట్టింపు సమయం పడుతోంది. దీంతో, ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా గమ్యస్థానం చేరాలనుకుంటున్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీని బదులు సిటీ బస్సులోనే, సొంత బైక్ మీదో వెళితేనే బాగుంటుందనే అభిప్రాయానికి వస్తున్నారు.
బేగంపేట ప్రాంతంలో మెట్రో రైలు ఏకంగా 7 నిమిషాల పాటు ఆగిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఓ వైపు ఛార్జీల భారం ఎక్కువగా ఉందని... ఈ నేపథ్యంలో ఈ ఆలస్యమేంటంటూ అసహనం వ్యక్తం చేశాడు. మెట్రో స్టేషన్లలో 20 సెకన్లపాటే ఆగాల్సిన రైలు... ఒక్కోసారి ఐదు నిమిషాలకు మించి ఆగుతోందంటూ పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. రైలు కోసం స్టేషన్లలో ఒక్కోసారి 15 నిమిషాల పాటు వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, మెట్రోకు కూడా కష్టాలు తప్పేట్టు లేవు. ఈ విషయం మెట్రో యాజమాన్యానికి షాక్ కలిగించేదే. ఎందుకంటే... మెట్రోలో ప్రయాణిస్తున్న అధిక శాతం ప్రయాణికులు కేవలం సరదాగానే ప్రయాణిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రయాణిస్తున్నవారు, ఆఫీసులకు వెళుతున్నవారు మెట్రోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాల సరదా తీరిపోయిన తర్వాత మెట్రో రైళ్లలో ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోతుందని భావిస్తున్నారు. దీంతో, మెట్రో ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉంది.