Narasimhan: మన బలం ఇదే: అమరావతిలో గవర్నర్ నరసింహన్
- విభజన తరువాత వృద్ధి రేటును పెంచుకుంటూ సాగుతున్నాం
- ప్రకృతి వనరులు, యువత, తీర ప్రాంతం ఏపీ బలం
- మౌలిక సదుపాయాల కల్పనతో కనెక్టివిటీ
- రైతుల సంక్షేమాన్ని మరవవద్దని గవర్నర్ సూచన
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిదానంగా వృద్ధి రేటును పెంచుకుంటూ వెళుతోందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ప్రారంభమైన ఐఈఏ సదస్సులో ఆయన ప్రసంగించారు. అపారమైన ప్రకృతి వనరులు, యువత అధికంగా ఉండటం దేశానికి బలమని, ఇదే సమయంలో ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండటం అదనపు బలమని ఆయన అభిప్రాయపడ్డారు.
మౌలిక సదుపాయాల కల్పనతో కనెక్టివిటీ పెరిగేలా చూడాల్సి వుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. రైతులను, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధి విధానాలు, సూచనలు, సిద్ధాంతాలు ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరినీ దారిద్ర్య రేఖ ఎగువకు చేర్చినప్పుడే అభివృద్ధి చెందినట్టని గవర్నర్ అన్నారు.