manda krishna madiga: జైలు నుంచి విడుదలైన మంద కృష్ణ.. కేసీఆర్ పై విమర్శలు!
- శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు పెట్టారు
- అప్పట్లో మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న కేసీఆర్‌పై మాత్రం నిర్బంధ కేసులు లేవు
- దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టం ఉందా?
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద విధ్వంసానికి కారణమయ్యారంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను చంచల్‌గూడ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. ఆయనకు నిన్న బెయిలు రావడంతో ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ... శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే తనపై 20 కేసులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై మాత్రం ఇటువంటి నిర్బంధ కేసులు పెట్టలేదని వ్యాఖ్యానించారు. దేశంలో దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టం ఉందా? అని నిలదీశారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ సర్కారు ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. వచ్చేనెల 1 నుంచే తమ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ దీక్షలను బాపుఘాట్ లేక ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ఉంటాయని చెప్పారు.