facebook: ఫేస్బుక్ ఖాతాకు కూడా ఆధార్ లింక్?
- ఆధార్‌లో ఉన్న పేరుతోనే అకౌంట్
- తప్పుడు పేర్లను తగ్గించే ప్రయత్నం
- తద్వారా మోసాలను తగ్గించే యోచన
అన్నింటికీ ఆధార్ అనే నరేంద్రమోదీ విధానాన్ని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అవును... త్వరలో ఫేస్బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉపయోగించేలా ఆ సంస్థ చర్యలు తీసుకోబోతోంది. తప్పుడు పేర్లతో అకౌంట్లు తెరిచి, మోసాలకు పాల్పడుతున్న వారిని అరికట్టడానికే ఇలాంటి పద్ధతిని ఫేస్బుక్ అమలు చేయనుంది.
అంతేకాకుండా ఇలా ఆధార్‌లో ఉన్న పేరుతోనే ఖాతా తెరవడం వల్ల స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ సులభంగా ఫేస్బుక్ ఖాతాను గుర్తపట్టవచ్చు. ఇప్పటికే ఈ విధానం ప్రయోగదశలో ఉన్నట్లు ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఫేస్బుక్ వినియోగం అతితక్కువగా ఉన్న ప్రాంతంలో దీన్ని ప్రయోగించినట్లు ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ఆప్షనల్‌గా మాత్రమే ఉంచబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంటే.. ఐచ్చికంగానే ఆధార్‌లో పేరుని ఉపయోగించుకోవచ్చన్నమాట. అయితే ముందుముందు ఈ విధానాన్ని తప్పనిసరి చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతా తెరవడానికి ఆధార్ సంఖ్య అవసరం లేదని, ఆధార్ ప్రకారం పేరు మాత్రమే అవసరం అని స్పష్టం చేశారు.