Andhra Pradesh: యూనస్ ఖాన్ సెంటర్ తో ఏపీ చారిత్రాత్మక ఒప్పందం!
- ఎంఓయూపై అంబేద్కర్ వర్శిటీ వీసీ, యూనస్ ఖాన్ సెంటర్ డైరెక్టర్ సంతకాలు
- పలు రంగాల్లో పరస్పర అవగాహనకు ఎంఓయూ దోహదం
- విలేకరుల సమావేశంలో మంత్రి గంటా
పేదరిక నిర్మూలనతోపాటు స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా సామాజిక వ్యాపారానికి చేయూత నందిస్తున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఢాకాలోని యూనస్ సెంటర్ తో ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఏపీ ఉన్నత విద్యామండలి భవనంలోఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మహమ్మద్ యూనస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై అంబేద్కర్ వర్శిటీ వీసీ కూన రామ్ జీ, యూనస్ ఖాన్ సెంటర్ డైరక్టర్ సంతకాలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ, విద్య, పరిశోధన, సమాచార సేకరణ, పునరుత్పాదక శక్తి, పర్యావరణ-వనరుల పరిరక్షణ, సామాజికాభివృద్ధి కోసం యువతకు శిక్షణ, గ్రీన్ టెక్నాలజీ బదలాయింపు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఈ ఎంఓయూ దోహద పడుతుందని అన్నారు. వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలోయూనస్ సోషియల్ బిజినెస్ సెంటర్ (వైఎస్బిసీ) ఏర్పాటు కావడం సంతోషకరమని, ఈ సెంటర్ అక్కడి పేదరికాన్ని మరింతగా రూపుమాపేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం పది సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని, దీని ద్వారా వచ్చిన ఫలితాలు చూసి ఇతర వర్శిటీల్లోనూ ఈ విధానాన్ని తీసుకొస్తామని గంటా తెలిపారు.
కాగా, అంతకుముందు, వైస్ చాన్సలర్ల సమావేశంలో మంత్రి గంటా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 6 కల్లా అధ్యాపక నోటిఫికేషన్లు వర్శిటీలు ఇవ్వాల్సిందేనని మరోమారు ఆదేశించారు. పీహెడ్ డీ సీట్ల భర్తీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.