kathi mahesh: కత్తి మహేశ్ 'హ్యాపీ న్యూ ఇయర్' చెప్పినా గుంజీలు తీయిస్తా!: ‘చిలుకూరు’ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్
- ఓ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రంగరాజన్ హెచ్చరికలు
- 'గుడిలో మాత్రమే' అంటూ స్పష్టం చేసిన అర్చకుడు
- పరాయి సంప్రదాయాన్ని మనమెందుకు ఆచరించాలని ప్రశ్న
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొత్త సంవత్సరం అంటూ ఎవరైనా తనకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెబితే, అక్కడికక్కడే గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీ ప్రభుత్వం కూడా దేవాలయాల్లో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది. దీనికి సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్, రంగరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది.
కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం మన సంప్రదాయం కాదని, తప్పు చేసిన వాడు భగవంతుని సన్నిధిలో శిక్ష అనుభవిస్తే తప్పేం కాదని రంగరాజన్ అన్నారు. మన సంప్రదాయం కానిదాన్ని ఎందుకు జరుపుకోవాలని ప్రశ్నించారు. ఓ పిల్లవాడిని కొత్త సంవత్సరం ఎప్పుడు? అని అడిగితే జనవరి ఫస్ట్‌న అన్నాడని, ఆ కుర్రాడికి అదే తెలుసని, ఉగాది గురించి ఎవరూ అతడికి చెప్పలేదని అన్నారు. అందుకే ఆ కుర్రాడితో గుంజీలు తీయించకుండా వదిలేశానని పేర్కొన్నారు.
దేవాలయంలో సెల్ఫోన్లో మాట్లాడిన ఓ ప్రొఫెసర్‌తోనూ గుంజీలు తీయించానని తెలిపారు. ‘హ్యపీ న్యూ ఇయర్ పంతులూ’ అని తనకు ఎవరు చెప్పినా గుంజీలు తీయిస్తానని, కత్తి మహేశ్ చెప్పినా ఆ పనే చేయిస్తానని పేర్కొన్నారు. అయితే అదంతా గుడిలో మాత్రమేనని, బయట ఎవరు ఎలా చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.