Andhra Pradesh: అమరావతిలో హైకోర్టు.. నేడు ఏసీజేకు అందనున్న చంద్రబాబు లేఖ!
- వచ్చే ఏడాది జూన్ కల్లా ఏర్పాటు?
- మూడు భవనాలను ప్రతిపాదించిన ప్రభుత్వం
- ఏసీజేకు లేఖ రాసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది జూన్ కల్లా హైకోర్టును ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ప్రతిపాదించిన మూడు భవనాల్ని పరిశీలించి అభిప్రాయం చెప్పాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని నేడు ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అందించనున్నారు.
అమరావతిలో నిర్మించ తలపెట్టిన హైకోర్టుకు సంబంధించిన నమూనా అతి త్వరలో ఖరారు కానుంది. నిర్మాణం పూర్తవడానికి మరో పదహారు నెలలు పడుతుంది. కాబట్టి ఈ లోపు అమరావతి పరిధిలో తాత్కాలికంగా హైకోర్టును అందుబాటులోకి తీసుకు రావడం వల్ల కక్షిదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాసిన లేఖను ఏసీజే పరిశీలించాక హైకోర్టు న్యాయమూర్తులతో చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల్ని చూసి మార్పులు ఏమైనా అవసరం అయితే సూచిస్తారు. హైకోర్టు తరలింపునకు అందరూ ఓకే అంటే కేంద్రమంత్రి వర్గం అనుమతితో రాష్ట్రపతి ప్రకటన చేస్తారు.