Adilabad: 120 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు!
- ఆదిలాబాద్లో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- వారం వ్యవధిలో రెండుసార్లు బద్దలైన గత రికార్డులు
- వాతావరణంలో విచిత్ర మార్పులకు సంకేతమన్న శాస్త్రవేత్తలు
తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి ఉంది. ఉదయం, సాయంత్రం చలితో వణుకుపుడుతుండగా, మధ్యాహ్నం ఎండ చురుక్కుమంటోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో చలిపులి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలిమంటలు కూడా శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతున్నాయి.
బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్లో గత 120 ఏళ్ల చరిత్రలోనే లేనంతగా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 19న 3.8 డిగ్రీలు నమోదు కాగా వారం వ్యవధిలోనే మరింత దిగజారింది. 20 డిసెంబరు, 2014న 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మూడేళ్ల తర్వాత ఈనెల 19న ఆ రికార్డు బద్దలైంది. ఇప్పుడు ఆ రికార్డుతో పాటు 17 డిసెంబరు 1897న నమోదైన 4.4 డిగ్రీల రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఈశాన్య, తూర్పు భారతం నుంచి శీతల గాలులు వీస్తున్నందువల్లే ఈ పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.