Tirumala: తిరుమలకు లక్షలాది మంది భక్తులు... 30 గంటలు నిరీక్షించాల్సిందే!
- రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం
- ఏర్పాట్లు పూర్తి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
- అన్న పానీయాలకు లోటు రానీయబోమన్న టీటీడీ
- ఐదు రోజుల పాటు అన్ని రకాల సేవలూ రద్దు
శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో వైకుఠ ఏకాదశి నాడు స్వామి వారిని ఎలాగైనా దర్శించుకోవాలన్న కోరికతో ఇప్పటికే తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు వేలాది మంది పిల్లా పాపాలతో ఎదురు చూస్తున్నారు. దేవదేవునికి ఇష్టమైన ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి నాడు స్వామిని దర్శించుకుంటే సర్వ పాప విముక్తి జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లే శ్రీమహా విష్ణువు వైకుంఠ ఏకాదశి నాడే మేలుకుంటారన్నది భక్తుల విశ్వాసం. ఈ రోజున స్వామిని దర్శించి సేవించుకునేందుకు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుని ఉత్తర ద్వారం తెరచుకునే క్షణాల కోసం వేచి చూస్తుంటారు. అందుకే వారితో పాటు స్వామిని ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోవాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.
ఇక తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సుందర సువర్ణ పుష్పాలు, విద్యుద్దీప కాంతులతో అందంగా అలంకరించారు. స్వామి వారి గర్భగుడి చుట్టూ ఉండే వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని ముస్తాబు చేశారు. ఐదు రోజుల పాటు అన్ని రకాల సేవలనూ రద్దు చేశారు. ఈ ఉదయం 10 గంటల నుంచి భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని, రేపు ఉదయం 9 గంటల నుంచి సర్వ దర్శనం మొదలవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మధ్యాహ్నానికే క్యూ కాంప్లెక్స్ నిండుతుందని భావిస్తున్నామని, ప్రత్యేక ప్రవేశం, దివ్యదర్శనం టికెట్లను జారీ చేయబోమని ఇప్పటికే ప్రకటించిన టీటీడీ, క్యూ లైన్లలో ఉన్నవారికి అన్న పానీయాలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో క్యూ లైన్లోకి ప్రవేశించే వారు దర్శనం కోసం 30 గంటల పాటు వేచి చూడాల్సి వుంటుందని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వారాలను ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తెరచి ఉంచుతామన్నారు.
ఇక స్వామివారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో, స్వామివారికి అభిషేకం నిర్వహించిన తరువాత వైకుంఠ ద్వారాన్ని శాస్త్రోక్త పూజల అనంతరం తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే వారికి దర్శనం చేయిస్తామని, అది కూడా రేపు ఉదయం 8 గంటల్లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు.