Guntur: నవ్వుతూ వెళ్లిన ఆడపిల్లలు విగతజీవులై వచ్చారని విలపిస్తున్న తల్లిదండ్రులు!
- గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- నిషేధమున్నా అదనపు తరగతులు నిర్వహిస్తున్న స్కూల్
- వెళ్లిన అరగంటలోనే దారుణమైన వార్త వినిపించింది
- ఏడుస్తూ వెల్లడించిన ఓ విద్యార్థిని తండ్రి
ఈ ఉదయం గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు టెన్త్ చదువుతున్న విద్యార్థినులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. టెన్త్ చదువుతుండటం, మరో మూడు నెలల్లో పరీక్షలు ఉండటంతో ఎక్స్ ట్రా క్లాసులకు హాజరు కావాలని పాఠశాల నుంచి ఒత్తిడి ఉందని, దాంతో తెల్లవారుజామునే అమ్మాయిలు లేచి, పాఠశాలకు బయలుదేరారని, ఇప్పుడు వారినిలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు.
ఎక్స్ ట్రా క్లాసులు ఇంతమందిని బలిగొన్నాయని ఆరోపించారు. స్కూలుకు వెళ్లి వస్తామని నవ్వుతూ తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిందని, ఆపై అరగంటలోనే దారుణమైన వార్తను విన్నామని ఓ బాలిక తండ్రి ఏడుస్తూ చెప్పాడు. ప్రమాద స్థలిలో రక్తంతో తడిసిన పుస్తకాలు, భోజనం క్యారేజీలు చూపరుల హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.
వాస్తవానికి వేమవరం నుంచి పేరేచర్లకు ఆటోలో పది నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఈ పది నిమిషాలే వారికి యమగండమైంది. కాగా, స్కూళ్లలో అడిషనల్ క్లాసులపై నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలను అతిక్రమించిన పాఠశాల అదనపు తరగతులు నిర్వహిస్తోందని తెలుస్తోంది. దీంతో ఈ విషయంలోనూ విచారణ జరిపించి, పాఠశాలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.