mann ki baat: 2017లో బాగా ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్... మన్ కీ బాత్!
- రెండో స్థానంలో జల్లికట్టు
- మూడో స్థానంలో జీఎస్‌టీ
- వెల్లడించిన ట్విట్టర్
ప్రధాని నరేంద్రమోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' హ్యాష్‌ట్యాగ్ 2017లో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచింది. వార్తలు, పరిపాలనా విభాగంలో ఈ హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అయినట్లు ట్విట్టర్ పేర్కొంది. ఇక రెండోస్థానంలో జల్లికట్టు, మూడో స్థానంలో జీఎస్‌టీ హ్యాష్‌ట్యాగ్‌లు ఉన్నట్లు తెలిపింది. అప్పట్లో మన్ కీ బాత్ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు డీమానిటైజేషన్, ట్రిపుల్ తలాక్, ముంబై రెయిన్స్, స్వచ్ఛ్ భారత్, గుజరాత్ ఎన్నికలు, ఆధార్ వంటి హ్యాష్‌టాగ్‌లు గతేడాది ట్రెండ్ అయినట్లు ట్విట్టర్ వెల్లడించింది.
ఇక క్రీడల విభాగంలో... సీటీ 17 (ఛాంపియన్స్ ట్రోఫీ), ఇండియా వర్సెస్ పాక్, ఐపీఎల్, డబ్ల్యూడబ్ల్యూసీ17 వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో బాహుబలి 2, బిగ్‌బాస్ 11, మెర్సల్ హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అయ్యాయని ట్విట్టర్ పేర్కొంది. ఈ వివరాలతో పాటు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న భారతీయుల జాబితాను కూడా ట్విట్టర్ విడుదల చేసింది.
దీని ప్రకారం... 37.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్, క్రికెట్ సెలెబ్రిటీలను వెనక్కి నెట్టి ప్రధాని నరేంద్రమోదీ మొదటిస్థానంలో నిలిచారు. ఈ ఏడాది మోదీ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 52 శాతం పెరిగినట్లు ట్విట్టర్ జాబితాలో పేర్కొంది. ఇంకా టాప్ 10లో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఈ ఏడాది ఫాలోవర్ల సంఖ్యలో ఆమిర్ ఖాన్‌ను అక్షయ్ కుమార్ దాటడం విశేషం.