Chandrababu: ఫైబర్ గ్రిడ్ పేరిట చంద్రబాబు పెద్ద కుట్రకు తెరలేపారు!: వైసీపీ నేత అంబటి ఆరోపణ
- ‘ఫైబర్ గ్రిడ్’ ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడేది కాదు
- కేబుల్ ఆపరేటర్లందరినీ నడిబజారులో పెట్టే ప్రయత్నం
- చంద్రబాబుపై మండిపడ్డ అంబటి
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరిట టీడీపీ ప్రభుత్వం దారుణమైన మోసానికి పాల్పడుతోందని, చంద్రబాబు పెద్ద కుట్రకు తెరలేపారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము టెక్నాలజీకి వ్యతిరేకం కాదని, ప్రజలకు చేరువ కావాలని అన్నారు. కానీ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అద్భుతమని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేశారని, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ట్రాయ్ నిబంధనల ప్రకారం..ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఈ రంగంలోకి రాకూడదని, కానీ, ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) రూపంలో ఈ రంగంలోకి దొడ్డిదారిలో చంద్రబాబు ప్రవేశించాలని చూశారని ఆరోపించారు. హెరిటేజ్’సంస్థ పార్టనర్స్ భాగస్వాములను, దుర్బుద్ధితో ఓ మెమోను కూడా జారీ చేశారని అన్నారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ తప్ప మిగిలిన వారెవరూ ఎలక్ట్రికల్, టెలిఫోన్ పోల్స్ పై కేబుల్స్ వేసేందుకు వీల్లేదని, అలా వేసిన కేబుల్స్ ను తొలగించండని ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని, ఏ ప్రైవేట్ ఎంఎస్ఓ కూడా తమ సొంతంగా కేబుల్ లైన్ వేసుకోలేరని అన్నారు.
సంబంధిత లైసెన్స్ ఉన్న వారు ఎవరైనా పోల్ మీదుగా లేదా అండర్ గ్రౌండ్ నుంచి అయినా కేబుల్ వేసుకోవచ్చనే నిబంధన ఉందని, చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఆదేశాలు జారీ చేసిందని విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా కేబుల్ ఆపరేటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, తమకు అనుకూలంగా లేని ఛానెళ్లపై వేటు వేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఇటువంటి చర్యలు అప్రజాస్వామికమని విమర్శించారు.
‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఎందుకంటే, కుట్రపూరితంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరినీ కూడా తమ అధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు నుంచే ఈ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్ల సిస్టమ్ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఊరులోకి కేబుల్ వెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ రంగంలో జరిగిన అభివృద్ధి. డిజిటలైజేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మొత్తం కేబుల్ ఆపరేటర్లందరూ దానిని ఆ విధంగా చేసేందుకు చాలా వెచ్చించారు.. ప్రతి ఇంటికీ సెటప్ బాక్స్ లు ఇచ్చారు.
ఇవాళ చంద్రబాబునాయుడు గారు, ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు. కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న టెక్నాలజీయే. కానీ, తాము అందించే టెక్నాలజీ మరింత నాణ్యమైందని, రూ.149కే అన్ని ఛానెల్స్ ఇవ్వడమనేది అసాధ్యమని ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా కేబుల్ ఆపరేటర్లందరినీ మోసం చేస్తూ వారిని నడిబజారులో పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ప్రైవేట్ రంగంలోని కేబుల్ ఆపరేటర్స్, కేబుల్ ఆపరేషన్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది’ అంటూ అంబటి మండిపడ్డారు.