sudeep: రాజకీయాల్లోకి రానున్న సుదీప్?
- కన్నడనాట చర్చనీయాంశం
- సీఎంను కలవడమే కారణం
- కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం?
కన్నడ రాజకీయాలకు మరింత సినిమా రంగు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉపేంద్ర, రమ్యలు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరో అగ్రకథానాయకుడు సుదీప్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు కన్నడనాట వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున ఆయనను రాజకీయాల్లోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అందులోనూ ఇటీవల సుదీప్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలవడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే దీనిపై సుదీప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో సుదీప్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా పోటీచేస్తారని కన్నడ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య ప్రకటించడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆమె సుదీప్‌ని అడిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ వార్తలన్నీ నిజమే అయితే సుదీప్ కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే శాసనసభ ఎన్నికల్లో చిత్రదుర్గలోని మోళ కాల్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే సుదీప్, సిద్ధరామయ్యను కలిసింది... కన్నడ నటుడు విష్ణువర్థన్ స్మారకం ఏర్పాటు చేసే విషయంపైనే తప్ప, మరే ఇతర రాజకీయ ఉద్దేశం లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.