KTR: కాలేజీ రోజుల్లో మీకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా?... కేటీఆర్‌కి నెటిజన్ ప్రశ్న.. తమాషా జవాబు!
- #AskKTR పేరుతో రెండు గంటల పాటు చాటింగ్ చేసిన మంత్రి
- ప్రశ్నల వర్షం కురిపించిన నెటిజన్లు
- పొగడ్తలతో ముంచెత్తిన ఇతర రాష్ట్రాల నెటిజన్లు
మంత్రి కేటీఆర్‌కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆయన చేసే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫాలోయింగే ఆయనను లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిపింది. కేంద్రంలో సుష్మా స్వరాజ్ మాదిరిగా రాష్ట్రంలో ట్విట్టర్ ద్వారా సమస్యలను పరిష్కరించే మంత్రి కేటీఆర్.. నిన్న అదే ట్విట్టర్లో #AskKTR పేరుతో నెటిజన్లతో సంభాషించారు. దాదాపు రెండు గంటల పాటు నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానమిచ్చారు.
అందులో భాగంగా ఓ నెటిజన్.. `కాలేజీ రోజుల్లో మీకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా?` అని అడిగాడు. దానికి కేటీఆర్ ` you expect me to give you names (వారి పేర్లు చెప్పాలని కోరుకుంటున్నావా?)` అని జవాబిచ్చారు. `సార్‌కి చాలా మంది ఉండి ఉంటారు.. అందుకే అమ్మాయిలు అని బహువచనం వాడారు` అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.
ఈ చాటింగ్‌లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలతో పాటు, వ్యక్తిగత ప్రశ్నలకు కూడా కేటీఆర్ ఓపిగ్గా సమాధానమిచ్చారు. నెటిజన్లు కొంటెగా అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన కూడా అదే శైలిలో సమాధానమిచ్చారు. అంతేకాకుండా 2017లో జరిగిన అభివృద్ధి గురించి, 2018లో తాము చేయనున్న అభివృద్ధి గురించి కేటీఆర్ నెటిజన్లకు వివరించారు. సినిమా హీరోలు, క్రికెటర్ల గురించి కూడా కేటీఆర్ కొన్ని కామెంట్లు చేశారు.