Tirumala: తిరుమలలో ఇంత రద్దీ తొలిసారి... క్యూ కాంప్లెక్స్ ను దాటి నారాయణగిరి మీదుగా ఔటర్ రింగురోడ్డు వరకూ నిలబడి పోయిన భక్తులు!
- వేచి చూస్తున్న లక్షా 50 వేల మంది భక్తులు
- గంటకు 4 వేల మందికే దర్శనం
- రెండు కిలోమీటర్లకు పైగా సాగిన క్యూలైన్
ముక్కోటి ఏకాదశినాడు తిరుమల వెంకన్నను కనులారా దర్శించుకుని తరించాలని భావిస్తూ అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి దాదాపు 10 వేల మందికి పైగా సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కలుగగా, మరో లక్షా 50 వేల మంది వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, 1 లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయి, నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు నిన్ననే నిండిపోగా, ఈ ఉదయం తరలివచ్చిన భక్తులను వరాహస్వామి గెస్ట్ హౌస్, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నసత్రం, కల్యాణ వేదిక మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు మళ్లించారు. ఔటర్ లో వాహన రాకపోకలను నిలిపివేశారు.
ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకూ భక్తులు కిక్కిరిసి పోగా, క్యూ కాంప్లెక్స్ లో ఖాళీ అయిన గదుల్లోకి వీరిని తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఇంత ఎక్కువగా భక్తులు రావడం ఇదే తొలిసారని, గత రికార్డులు నేటితో చెరిగిపోతాయని చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం క్యూ లైన్ లోకి ప్రవేశించిన వారికి రేపు సాయంత్రంకి దర్శనం చేయించేందుకు ప్రయత్నిస్తామని, గంటకు 4 వేల మందికి మాత్రమే దర్శనం కలుగుతోందని వెల్లడించారు. కాగా, తిరుమలకు నేడు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.