bitcoin: భారత్‌లో తొలి బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్... ప్లూటో ఎక్స్ఛేంజ్
- మొబైల్ నెంబర్‌తో బిట్‌కాయిన్ లావాదేవీలు
- ఐపీ అడ్రస్ అవసరం లేకుండానే కార్యకలాపాలు
- బిట్ కాయిన్ అమ్మడం, కొనడం, ఖర్చుచేయడం వంటి సేవలు
ప్రభుత్వం వారిస్తున్నప్పటికీ దేశంలో బిట్‌కాయిన్ బిజినెస్ బూమ్ పుంజుకుంటోంది. బిట్ కాయిన్ పేరుతో చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద వెబ్సైట్లు, యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే `ప్లూటో ఎక్స్ఛేంజ్` పేరుతో దేశంలో తొలి బిట్‌కాయిన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పనిచేసే బిట్‌కాయిన్ లావాదేవీలను కేవలం మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే చేసుకునే సదుపాయాన్ని ఈ యాప్ కల్పించనుంది.
పది అంకెల మొబైల్ నెంబర్‌తో లావాదేవీలు చేయడానికి రక్షణగా నాలుగు అంకెల పిన్ను సృష్టించుకోవాలని ప్లూటో ఎక్స్ఛేంజ్ వ్యవస్థాపకుడు భరత్ వర్మ తెలిపారు. ఈ యాప్ ద్వారా బిట్కాయిన్లు కొనడం, అమ్మడం, ఖర్చు చేయడం, దాచుకోవడం వంటి సేవలను ఒక్క క్లిక్ ద్వారానే అందించనున్నట్లు భరత్ పేర్కొన్నారు.