china: చైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది: డ్రాగన్ కంట్రీపై మండిపడ్డ ట్రంప్
- అక్టోబర్ నుంచి 30 సార్లు చమురు సరఫరా
- గుర్తించిన అమెరికా శాటిలైట్లు
- కొట్టి పారేసిన చైనా విదేశాంగ శాఖ
ఉత్తర కొరియా చమురు దిగుమతులపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తూ... ఉత్తర కొరియాకు చైనా చమురు సరఫరా చేస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. చైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనా ఇలాగే వ్యవహరిస్తూ పోతే.. ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అక్టోబర్ నుంచి ఉత్తర కొరియాకు చైనా 30 సార్లు చమురును సరఫరా చేసిందని దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు. సముద్ర మార్గం గుండా చైనా ఓడలు ఉత్తర కొరియాకు చమురు సరఫరా చేయడాన్ని అమెరికా శాటిలైట్లు గుర్తించాయని వారు తెలిపారు. అమెరికా పత్రికల్లో సైతం దీనికి సంబంధించిన కథనాలు వచ్చాయి. మరోవైపు, ఈ వార్తలను చైనా ఖండించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను తాము కఠినంగా అమలు చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.